
ఆ షాపులపైనే నజర్
జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రక్రియ జోరందుకుంది. 2025–27కి గాను వైన్ షాప్‌ల కేటాయింపు కోసం ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో గత నెల 26 నుంచి ప్రారంభం కాగా, 18వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో లిక్కర్ వ్యాపారులు 2023–25లో వైన్‌షాపుల వారీగా జరిగిన మద్యం అమ్మకాలపై దృష్టిసారించారు. ఈ నెల 23న లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 93 వైన్స్ షాపులు ఉండగా, ఐదు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24, గజ్వేల్ పరిధిలో 26, చేర్యాలలో 16, హుస్నాబాద్‌లో 16, మిరుదొడ్డిలో 11 ఉన్నాయి. రిజర్వేషన్‌లలో ఎస్సీలకు 9, గౌడలకు 16 షాపులను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్1,2023 నుంచి నవంబర్ 30,2024 వరకు రూ.1,415.32 కోట్లు, డిసెంబర్ 1,2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు రూ.959.98కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇలా జిల్లా మొత్తం 2023–25లో ఇప్పటి వరకు రూ.2,375.3కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం.
ఒక్కో షాపులో రూ.30కోట్లకు పైగా..
జిల్లా వ్యాప్తంగా 11 వైన్స్ దుకాణాలలో ఒక్కో షాపులో రూ.30కోట్లకుపైగా విక్రయాలు జరగడం విశేషం. సిద్దిపేట పట్టణంలో షాప్ నంబర్–5లో మొత్తంగా రూ.37.76కోట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే జగదేవ్‌పూర్ మండలంలో తిగుల్ నర్సాపూర్ వైన్ షాప్‌లో రూ.34.44కోట్లు, మర్కూక్‌లో రూ.32.7కోట్ల విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
లెక్కల్లో లిక్కర్ వ్యాపారులు
ఏ ఏరియా వైన్స్‌లో ఎంత మద్యం అమ్మకాలు జరిగాయనేదానిపై ఆయా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లలో పరిచయం ఉన్న వారితో వ్యాపారులు లిస్టులను తెప్పించుకున్నారు. ఎంత వ్యాపారం జరిగితే ఎంత లాభం ఉంటుందన్న విషయంపై లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూ.55లక్షల చెల్లించే షాపులలో ఎక్కువ విక్రయాలు జరిగే వాటిపై సైతం నజర్ పెట్టారు. మద్యం వ్యాపారులు గ్రూప్‌ల వారీగా హోటల్స్, లాడ్జీలలో సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్ని షాప్‌లకు.. ఎక్కడి షాపులకు టెండర్లు వేయాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం.
రేపటితో ముగియనున్న గడువు
వైన్స్ షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వతేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు కేవలం 561 దరఖాస్తులే వచ్చాయి. 2023–25లో 4,166 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంతో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు 300 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్కిల్ వారిగా సిద్దిపేట 163, గజ్వేల్ 159, హుస్నాబాద్ 145, చేర్యాల 76, మిరుదొడ్డి 18 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే జిల్లాలో 9 షాప్‌లలో ఒక్క దరఖాస్తు రాలేదు. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దిపేట–15, 16, గజ్వేల్ పరిధిలోని నంబర్లు 27, 40, 41, మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో 88, 91, 92, 93 నంబర్ షాప్‌లకు ఇప్పటి వరకు దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం
వైన్ షాప్‌ల కేటాయింపు కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ నెల 23న డ్రా ద్వారా షాప్‌లను కేటాయిస్తాం.
– శ్రీనివాస మూర్తి, ఈఎస్
11 వైన్స్ షాపులలో రూ.30 కోట్ల చొప్పున అమ్మకాలు
లెక్కలేస్తున్న మద్యం వ్యాపారులు
జిల్లాలో 93 దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు 561