
అందరి అభీష్టంతోనే ఎంపిక
● పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం
● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ జ్యోతి రౌటేలా
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నచ్చిన వ్యక్తే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికవుతారని ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగదీశ్, నజీమ్ అహ్మద్, వరలక్ష్మితో కలిసి జ్యోతి రౌటేలా సిద్దిపేట అర్బన్, పట్టణం, రూరల్, నారాయణరావుపేట మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల, బ్లాక్, జిల్లాస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కష్టపడే నాయకుడ్ని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ప్రజాధరణ ఉన్న నాయకుని నియమించడానికే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉంటుందన్నారు. దళిత, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రధా ని మోదీ పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్ నియంతృత్వ పాలన చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చే యడమే తమ లక్ష్యం అన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష ఆశావహులు కమిటీకి దరఖాస్తులు అందజేశారు.