
కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యం కావాలి
● ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా ● వర్గల్‌లో కార్యకర్తల అభిప్రాయ సేకరణ
వర్గల్(గజ్వేల్): కార్యకర్తల అభీష్టం మేరకే నాయకత్వ ఎంపిక జరగాలనే వినూత్న కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా అన్నారు. పార్టీ పటిష్టతకు, ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఈ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం శాకారం టీజీఆర్ ఫంక్షన్‌హాల్‌లో డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, మర్కూక్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, కార్యకర్తల అభిప్రాయం సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం మెదక్ జిల్లాలో అబిప్రాయ సేకరణ పూర్తి చేశామని, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో జరుగుతోందన్నారు. ఈనెలాఖరు వరకు డీసీసీ అధ్యక్షుల ఎంపికను ప్రకటిస్తామన్నారు. మండల, గ్రామ స్థాయిలో కూడా ఇదే పద్ధతిలో నాయకత్వ ఎంపిక జరుగుతుందన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్లు జగదీశ్వర్ రావు, నజీర్ అహ్మద్, వరలక్ష్మి, సంతోష్ గుప్త, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.