
దరఖాస్తుల ఆహ్వానం
మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియెట్ ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్) గ్రూపు విద్యార్థినులకు నర్సింగ్ సబ్జెక్టులు బోధించుటకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన గెస్టు ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మహిళలు ఈ నెల 31 నుంచి, ఆగస్టు 2 వరకు మిరుదొడ్డిలోని కేజీబీవీలో దరఖాస్తులను అందించాలని కోరారు.
హిందీ అతిథి అధ్యాపక పోస్టుకు..
దుబ్బాకటౌన్: పట్టణంలోని కస్తూర్బాలో హిందీ బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి స్వాతి బుధవారం తెలిపారు. హెచ్‌పీటీ అర్హత ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేతనం రూ.18వేలు ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఆగస్టు 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డెమో తరగతుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
గజ్వేల్‌రూరల్: జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) డిపో పరిధి లోని ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను డయల్ యువర్ డీఎం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తమ సమస్యలను 99592 26270 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘గ్రంథాలయ’ బడ్జెట్ ఆమోదం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా గ్రంఽఽథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చైర్మన్ లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆమోదించారు. గ్రామ పంచాయతీలకు గ్రామ గ్రంథాలయాలు చెల్లించాల్సిన సెస్ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని జిల్లా పంచాయతీ అధికారి దేవికాదేవి తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ రవికుమార్, లైబ్రరీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి మండలాన్ని
కరీంనగర్‌లో కలపండి
బెజ్జంకి(సిద్దిపేట): మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని స్థానిక నాయకులు కోరారు. ఈమేరకు మంత్రి వివేక్‌ను బుధవారం నగరంలోని తన నివాసంలో కరీంనగర్ జిల్లా పోరాట సమితి బెజ్జంకి నాయకులు మానాల రవి, మైల ప్రభాకర్‌లు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజల అభిప్రాయం మేరకు గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని వారు వివరించారు.
జిల్లాకు మంచిపేరు తేవాలి
సిద్దిపేటజోన్: ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య సూచించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సెలెక్షన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అథ్లెటిక్స్ ద్వారా మంచి భవిష్యత్తు ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. వివిధ అంశాల్లో 60 మంది బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకట్ స్వామి, ప్రతినిధులు రామేశ్వర్‌రెడ్డి, భిక్షపతి, అశోక్, ఉప్పలయ్య, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.