
ఛీ.. ఇదేం తీరు
రోడ్లపైనే మాంసం విక్రయాలు
అధికారుల చర్యలేవి
మాంసాన్ని రోడ్లపై విక్రయిస్తున్నా.. అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ.50 లక్షల నిధులతో నిర్మించిన షట్టర్లను ఖాళీగా ఉంచి.. రోడ్లపై మాంసం విక్రయించడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని షట్టర్లలోనే మాంసం విక్రయాలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.
దుబ్బాకటౌన్: పట్టణంలో రోడ్లపైనే మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసి రోడ్లంతా చిత్తడిగా మారినా.. పైగా కుక్కలు మలమూత్రాలు విసర్జించిన ప్రాంతాల్లోనే విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాన్ వెజ్ మార్కెట్ నిర్మించి, వివిధ హంగులతో తీర్చి దిద్దినా మాంసం విక్రయదారుల తీరు మారడం లేదు. అసలే వానాకాలం.. ఆపై సీజనల్ వ్యాధులతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు రోడ్లపైనే మాంసం విక్రయిస్తుండటంతో జంకుతున్నారు. పట్టణంలో నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులతో 10 షట్టర్లను నిర్మించి విక్రయదారులకు కేటాయించారు. కానీ విక్రయదారులు రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. అన్ని వసతులతో షట్టర్లు ఉన్నా రోడ్లపైనే విక్రయించడం చర్చనీయంశంగా మారింది.
కుక్కల వీరవిహారం
రోడ్లపై మాంసం విక్రయిస్తుండటంతో కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. వ్యర్థాలు తినడానికి పోటీ పడుతున్నాయి. అక్కడే మలమూత్రాలు విసర్జి స్తున్నాయి. అదే ప్రాంతంలో మాంసం అమ్మడంతో మాంసాహార ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా.. మాంసం విక్రయించడం చూస్తుంటే వారు వ్యవహరించే తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్ధంలా కనిపిస్తోంది.
కుక్కలు మలమూత్రాలు
విసర్జించిన ప్రాంతాల్లో అమ్మకాలు
మార్కెట్ ఉన్నా బయటే విక్రయాలు
మారని విక్రయదారుల తీరు
సీజనల్ వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు
ప్రజల ప్రాణాలతో చెలగాటం
రోడ్లపై, అపరిశుభ్రమైన పరిసరాలలో మాంసం విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. షట్టర్లలో దుకాణాలను నడపడానికి ఏమైనా ఇబ్బందులుంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలి. కానీ ఎక్కడపడితే అక్కడ మాంసం విక్రయించడం తగదు.
– మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక
విక్రయాలు చేస్తే చర్యలు
బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై మాంసం విక్రయాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. మొదటి హెచ్చరికగా నోటీసులు పంపిస్తాం. తీరు మారకుంటే చర్యలు తప్పవు.
– రమేశ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్

ఛీ.. ఇదేం తీరు

ఛీ.. ఇదేం తీరు