
స్థానిక పోరుకు సన్నద్ధం
‘పరిషత్’ ఎన్నికలపై పార్టీల నజర్
● గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ● ముఖ్యకార్యకర్తలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సమావేశాలు
సాక్షి, సిద్దిపేట: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కైవసమే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు తేలితే ఎవరెవరు పోటీ చేస్తారో తేలనుంది.
సంక్షేమ పథకాలే అస్త్రంగా కాంగ్రెస్..
రానున్న స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోవడానికి అధికార పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పార్టీ నియమించింది. ఇటీవల గాంధీభవన్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిలు నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, పూజల హరికృష్ణ, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు కార్యకర్తలతో సమావేశామవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజలకు వివరించాలని, అర్హులకు పథకాలను అందేలా చూడాలని చెబుతూ కార్యకర్తలకు సూచిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఆరు గ్యారంటీలపై బీఆర్‌ఎస్ పోరు
జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించారు. పలు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా ఎవరు గెలుపొందే అవకాశం ఉంటుందని ఇప్పటికే ఒక దఫా బీఆర్‌ఎస్ సర్వే చేయించింది. ఇటీవల నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యకార్యకర్తలతో సమావేశాలను నిర్వహించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయడం లేదంటూ ప్రజలల్లోకి తీసుకెళ్లాలని మార్గదర్శనం చేస్తున్నారు.
పట్టున్న గ్రామాలపై బీజేపీ దృష్టి
గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న గ్రామాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల నియమితులైన జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ఆధ్వర్యంలో మండలాల వారీగా ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం ‘గ్యారంటీ’లు అమలు చేయడం లేదని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుపొందిన వివరాలు
జెడ్పీటీసీలు
బీఆర్‌ఎస్: 22, కాంగ్రెస్: 1
ఎంపీటీసీలు
మొత్తం ఎంపీటీసీ స్థానాలు: 229
బీఆర్‌ఎస్ : 153, కాంగ్రెస్: 29, బీజేపీ: 04, సీపీఎం:1, ఇతరులు: 42
పోటీకి సై అంటున్న వామపక్షాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు సైతం పోటీకిసై అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై అధిష్టానం నుంచి స్పష్టత వస్తే దానికనుగుణంగా పోటీ చేసే అంశంపై సీపీఐ, సీపీఎంలు కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.