● ఆటోను ఢీకొట్టిన డీసీఎం ● ఓ కేసు విషయమై పీఎస్‌కు వెళ్తుండగా ఘటన
జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కోహీర్ మండలంలోని బడంపేట గ్రామానికి చెందిన రాచయ్య(48) జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న రాచయ్య తన భార్య పద్మమ్మ(40)ను తీసుకొని ఆటో నడుపుకుంటూ వికారాబాద్ జిల్లా బంట్వారం పోలీసు స్టేషన్‌లో హాజరు వేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీఎం ఆటోపైకి ఎక్కడంతో అందులో ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పొలానికి వెళ్తుండగా..
కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. సదాశివపేటకు చెందిన నారాయణగౌడ్ (68) 40 ఏళ్లుగా పటాన్ చెరులో నివాసం ఉంటున్నారు. గురువారం సదాశివపేటలోని తన వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. కంది ఐఐటీ హైదరాబాద్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వెనుక వైపు నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నారాయణ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


