27న ‘నిధి ఆప్కే నిఖత్‌ 2.0’ | - | Sakshi
Sakshi News home page

27న ‘నిధి ఆప్కే నిఖత్‌ 2.0’

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

27న ‘నిధి ఆప్కే నిఖత్‌ 2.0’ ‘ఉపాధి’లో అవినీతిని ఉపేక్షించం బాలికల ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

పటాన్‌చెరు టౌన్‌: భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ద్వారా సమస్యల పరిష్కారానికి ఈనెల 27న ‘నిధి ఆప్కే నిఖత్‌ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5:45 గంటల వరకు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. భవిష్య నిధికి సంబంధించిన ఫిర్యాదులు, క్లెయిమ్‌, పెన్షన్‌, ఖాతాలు తదితర సమస్యలు ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, యాజమాన్య ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరాలను పటాన్‌చెరులోని గౌతమ్‌నగర్‌ శాంతినికేతన్‌ హైస్కూల్‌, బొల్లారం ఇండస్ట్రియల్‌ ఏరియాలోని కెఎల్‌ హైటెక్‌ సెక్యూర్‌ ప్రింట్‌ లిమిటెడ్‌, కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లోని సంయుక్త ఇంటర్నేషనల్‌ స్కూల్‌, మాదాపూర్‌లోని నిసుమ్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మనోహరాబాద్‌ మండలం కల్లకల్‌లోని గ్లోస్టర్‌ కేబుల్స్‌ లిమిటెడ్‌లో నిర్వహించనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

22–ఏ బాధితులకు

అండగా బీఆర్‌ఎస్‌

ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి

29న అమీన్‌పూర్‌ వేదికగా పోరుబాట

పటాన్‌చెరు: నియోజకవర్గంలో 22–ఏ నిషేధిత జాబితా భూ బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఈనెల 29న నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్‌ వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22ఏ భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుమారు 15 వేల మంది నిరసన సభకు హాజరు కానున్నట్లు చెప్పారు. నిరసన సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ ఆదర్శ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసకుంటామని అదనపు డీఆర్‌డీఓ బాలరాజు హెచ్చరించారు. మంగళవారం సిర్గాపూర్‌లో ఉపాధి హామీ పనులపై 5వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలో జరిగిన రూ.1.27 కోట్ల పనులకు సంబంధించి నాణ్యతాలోపం, నిధుల ఖర్చు వివరాలపై తనిఖీ నివేదికను డీఆర్‌పీలు చదివి వినిపించారు.

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక నిర్వహించారు. జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 4 నుంచి 6వరకు నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనేలా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ శిక్షకులు వినయ్‌, ప్రకాశ్‌, సెలక్షన్‌ కమిటీ సభ్యులు రూపేందర్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement