వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ సీట్ల కేటాయింపుపై ఆగ్రహం
ములుగు(గజ్వేల్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్(ఉద్యాన) సీట్లను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసివేసి, ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రత్యేక హోదాను కాపాడాలంటూ, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ సీట్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. ఈ అంశంపై పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దీంతో ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూ పుతోందన్నారు. హార్టికల్చర్ సీట్ల భర్తీపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభు త్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ములుగు తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ రఘుపతి విద్యార్థులకు నచ్చజెప్పారు.


