అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: పంట రుణాల పంపిణీ ప్రక్రియ 100 శాతం పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి బ్యాంకర్లతో పంట రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని బ్యాంకులు లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందిస్తున్నప్పటికీ, మరికొన్ని బ్యాంకులు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడం లేదన్నారు. బ్యాంకుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, తదుపరి సమావేశం వరకు వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధికి చేయూత అందించాలని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, నాబార్డ్ ఏజీఎం కృష్ణతేజ, పరిశ్రమల శాఖ జీఎం తుల్జానాయక్ తదితరులు పాల్గొన్నారు.


