● కబ్జాకు గురైన చెరువు అలుగు కాల్వలపై ఆరా
● ప్రభుత్వ భూమి కబ్జాపైనా చర్యలు
హత్నూర(సంగారెడ్డి): ‘కాలువలు మింగేస్తుండ్రు’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితం అయిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశంతో సోమవారం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు కదిలి వచ్చారు. మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి పెద్ద చెరువు రెండు అలుగులను కబ్జా చేసి పూడ్చివేయడంతో నీటిపారుదల శాఖ ఏఈ శ్రీకాంత్, రెవెన్యూశాఖ ఆర్‌ఐ రంగయ్య, లైసెన్స్‌డ్ సర్వేయర్ చేతన్, జీపీఓ రాములు కాల్వలను సందర్శించి సర్వే నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. మట్టి పోసి కాల్వ పూడ్చిన వ్యక్తికి సంబంధించిన పట్టా భూమి ఎంతవరకు ఉందన్న విషయాన్ని కూడా విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ‘అసైన్ భూమికి ఎసరు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సంబంధించి కాసాల శివారులోని 336 ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు అందిస్తామని ఆర్‌ఐ రంగయ్య తెలిపారు.


