మనోవేదనకు బలై.. | - | Sakshi
Sakshi News home page

మనోవేదనకు బలై..

Aug 25 2026 12:10 PM | Updated on Aug 25 2026 12:10 PM

నర్సు సురేఖ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన విషయాలు

సంగారెడ్డి క్రైమ్‌: తల్లిదండ్రుల హత్య కేసులో సమాజం చిన్నచూపు చూడటంతో జీవితంపై విరక్తి చెంది నర్సు సురేఖ ఆత్మహత్య చేసుకుంది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తరువాత బంధువులు, సోదరులు, రక్త సంబంధీకులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై చివరిగా చనిపోవాలని నిర్ణయించుకుంది. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు.. అన్నా నీకు రాఖీ కట్టలేకపోతున్నా.. నన్ను క్షమించు.. అని తాను రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

ఏడు నెలల క్రితం తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపి.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలై మనోవేదనకు గురైన నర్సు మత్తు ఇంజక్షన్‌ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి లక్ష్మీ, దశరథ ముదిరాజు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురైన సురేఖ(25), వృత్తిరీత్యా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. ఓ యువకుడిని ప్రేమించిన సురేఖ పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. కాగా కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో 2026 జనవరి 24వ తేదీన కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అడ్డువస్తున్నారని మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి చంపేసింది. ఈ కేసులో సురేఖ చంచల్‌గూడ జైలుకు వెళ్లింది. అయితే ఇటీవల బెయిల్‌పై విడుదలైంది. అప్పటి నుంచి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటోంది. ఈనెల 23న సాయంత్రం 9 గంటలకు తల్లిదండ్రులను చంపినట్లుగానే ఆమె సైతం మత్తు ఇంజక్షన్‌ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొన్ని రోజులుగా సురేఖ డిప్రెషన్‌లో ఉన్నట్లు తోటి రూమ్‌మేట్స్‌ తెలిపారు. నన్ను క్షమించు అన్న అని సూసైట్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇది చూసినవారు కన్నీరు మున్నీరయ్యారు. కాగా ఔషధ దుకాణంలో సిరంజి కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంజక్షన్‌, సిరంజిని స్వాధీనం చేసుకున్నారు. సోదరుడు అశోక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు.

పేరెంట్స్‌ను చంపి జైలుకు.. బెయిల్‌పై వచ్చి సూసైడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement