చెరువులో మునిగి నాయీ బ్రాహ్మణుడు మృతి
దుబ్బాకటౌన్: స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సోమవారం బేగంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిటుకుల కిష్టయ్య(75) నాయీ బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తునికి రాజు మృతి చెందగా, ఆయన దశదిన కర్మ సందర్భంగా ఇతర కుటుంబ సభ్యులకు గ్రామంలోని పెద్దచెరువు వద్ద క్షవరం చేశాడు. అనంతరం అదే చెరువులో స్నానం చేయడానికి వెళ్లిన కిష్టయ్య ప్రమాదవశాత్తు కాలు జారి నీట మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య చిటుకుల సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


