ప్రజారోగ్యానికి మరింత భరోసా | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి మరింత భరోసా

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

ప్రజారోగ్యానికి మరింత భరోసా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ‘కనీస వేతనాలు అమలు చేయాలి’

నారాయణఖేడ్‌: ప్రజారోగ్య వ్యవస్థను రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్‌ షెట్కార్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, ఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, మున్సిపల్‌ చైర్మన్‌ నగేశ్‌ షెట్కార్‌, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఆస్పత్రి నిర్వాహకులు అనురాగ్‌రెడ్డి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

కంది(సంగారెడ్డి): అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అన్నారు. ఆదివారం కంది మండల పరిధిలోని ఇంద్రకరన్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆంజనేయులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచందర్‌ నాయక్‌, మండల పార్టీ అధ్యక్షుడు మొగులయ్య, సర్పంచ్‌ శంకరి రాజు, ఉప సర్పంచ్‌ లావణ్య రాజేందర్‌ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మోతిలాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌

యువకుడికి అవార్డు

జహీరాబాద్‌ టౌన్‌: వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు జహీరాబాద్‌కు చెందిన యువకుడు జగదీశ్‌ బుయేకర్‌. కార్పొరేట్‌ ఉద్యోగుల ప్రయాణ అవసరాల కోసం ఆయన రూపొందించిన వినూత్న స్టార్టప్‌కు ‘ఇండియా ఎంఎస్‌ఎఈ అండ్‌ స్టార్టప్‌ అవార్డు వరించింది. పుణెలోని మారియట్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జహీరాబాద్‌కు చెందిన జగదీశ్‌, ఆయన స్నేహితుడు నిర్మల్‌ జిల్లాకు చెందిన సాయి కుమార్‌ బైండ్ల ఇద్దరూ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం జగదీశ్‌ పుణెలోని ఓ ఐటీ సంస్థలో ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌గా, సాయి కుమార్‌ చైన్నెలో పైపింగ్‌ డిజైనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూనే, స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో కార్యాలయ సమయం తర్వాత, వారాంతాల్లో కోడింగ్‌ నేర్చుకుని ‘వరధి క్లబ్‌ పేరుతో కార్పొరేట్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక బైక్‌ రైడ్‌ షేరింగ్‌ యాప్‌ను సొంతంగా అభివృద్ధి చేశారు.

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కేవల్‌ కిషన్‌ భవన్‌లో సీఐటీయూ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. కార్మికవర్గంపై బీజేపీ 10 ఏళ్లుగా యుద్ధం చేస్తుందన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్‌కోడ్‌లు తెచ్చిందన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఊప లాంటి చట్టాలను ప్రయోగిస్తున్నారని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement