చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధి చంద్లాపూర్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామంలో చిన్న చిన్న వీధులు, పురాతనం నాటి పెంకుటిళ్లు, పచ్చని పొలాలు, అక్కడే రంగనాయక సాగర్ రిజర్వాయర్, రంగనాయక స్వామి గుట్ట ఉండటంతో నిత్యం ఈ ప్రాంతం షూటింగ్‌ల చిత్రీకరణతో సందడిగా మారుతోంది. ఇటీవల ఓ సుకుమారి సినిమా షూటింగ్ సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. గ్రామంతో పాటు రిజర్వాయర్, రంగనాయక స్వామి గుట్టపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే యూట్యూబ్ చిత్రాలు, ఫోక్ సాంగ్స్ వంటి చిత్రాల షూటింగ్ నిత్యం గ్రామంలో జరుగుతూనే ఉంటాయి. రంగనాయక సాగర్ కట్టపై ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌లకు వేదికగా మారింది. రిజర్వాయర్ సందర్శనకు స్నేహితులు, బంధువులు కుటుంబ సమేతంగా వచ్చి స్వియ చిత్రాలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు.
చేగుంట(తూప్రాన్): మండలంలోని రెడ్డిపల్లిలో రెండు నెలలుగా సర్కారుబాయి సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పాతకాలపు అసమానతలను తొలగించి నేటితరాన్ని చైతన్య పరిచేందుకు చిత్రం రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాలో హీరో శ్రీరాం, హీరోయిన్‌గా వర్షికతో పాటు ప్రముఖ నటులు బాహుబలి ప్రభాకర్, అఖండ నాగమహేశ్‌లు నటిస్తున్నారు. ఏకకాలంలో నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా రెడ్డిపల్లిలో చిత్రీకరిస్తుండటం విశేషం. సినిమా షూటింగ్‌తో గ్రామంలో రెండు నెలలుగా సందడి నెలకొంది. మండలంలోని చందాయిపేటలోని గద్దలకొండలో.. గణేష్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
రెడ్డిపల్లిలో.. ‘సర్కారుబాయి’..


