జహీరాబాద్ టౌన్: తెలంగాణ ఊటీగా పేరొందిన గొట్టం కోట ప్రాంతం పచ్చని అడవులు, చెరువు, కొండల మధ్య సహజ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి ప్రేమికులను ఎంతో అకర్షించే ఈ ప్రాంతం సినీ షూటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. తెలంగాణ–కర్నాటక రాష్ట్ర సరిహద్దులో మొగుడంపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఈ గొట్టం కోట ఉంది. పచ్చని చెట్లు, వంకరటిక్కర మార్గాలు స్వాగతం పలుకుండగా, చంద్రంపల్లి చెరువు(డ్యామ్) ఈ ప్రదేశాన్ని మరింత శోభను చేకూరుస్తోంది. సూర్యాస్తమయంలో ఫొటోలు, షూటింగ్‌కు అత్యంత అనుకూలమైన ప్రదేశం. జహీరాబాద్‌కు చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్, సినీ నిర్మాత ఎం.శివకుమార్ తీసిన ‘ఆకాశంలో సగం’ సినిమా షూటింగ్‌తో ఈ ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమాను చాలా వరకు ఇక్కడే చిత్రీకరించారు. ఆదివారం, సెలవు రోజుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు.


