పటాన్‌చెరు టౌన్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన అన్న అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన సంజయ్ (41) ఉపాధి కోసం ఈ నెల 15న పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్‌కు వచ్చాడు. ఇక్కడికి చేరుకున్న వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఇస్నాపూర్‌కు సురక్షితంగా చేరుకున్నట్లు తెలిపాడు. మరుసటి రోజు ఇస్నాపూర్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నానని కుటుంబ సభ్యులకు మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. అయితే, ఈ నెల 17న సంజయ్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం తెలిసిన వారి వద్ద, స్థానికంగా అంతటా వెతికినా ఎక్కడా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో తన అన్న అదృశ్యమయ్యాడని తమ్ముడు గౌతమ్ శుక్రవారం పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


