ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రఘుపతి కథనం మేరకు.. ములుగుకు చెందిన చిల్లసాగర్ రవి(40) కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన సొంత పని నిమిత్తం ములుగు స్టేజీవద్దకు వెళ్లిన అతను తిరిగి రోడ్డు దాటుతుండగా గజ్వేల్ వైపు వెళ్తున్న ఓ లారీ రవిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. రవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు మహేశ్, కూతురు అనూష ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రవి మృతదేహంతో రాజీవ్‌రహదారిపై ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించారు. గజ్వేల్‌రూరల్ సీఐ రవిరాజు, ఎస్‌ఐ రఘుపతి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


