పుల్‌కల్ (అందోల్): శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 21న జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఇంజినీర్లకు సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు నివాళులర్పించారు. ఈ విషాద ఘటన జరిగి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సింగూరు జలవిద్యుత్ కేంద్రంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మృతిచెందిన ఇంజినీర్ల చిత్రపటాలకు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఏడీఈలు పాండయ్య, సౌజన్య, రాధిక, పలువురు విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భర్తకు తీవ్రగాయాలు
జహీరాబాద్ టౌన్: చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంల భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ వినయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సత్వార్‌కి చెందిన దంపతులు కలకోడ మన్నన్, తస్లీమ్ బేగంలు టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్‌పై కర్ణాటకలోని మన్నెకిల్లి వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో చిరాగ్‌పల్లి గ్రామ శివారులో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తస్లీమ్ బేగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మన్నన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
విద్యార్థిని ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): షకడుపునొప్పి భరించలేక ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం... లక్ష్మీనగర్‌కు చెందిన వగ్గు రాములు, సాయవ్వ దంపతులకు వగ్గు రశిత (14), అభిలాష్‌లు ఇద్దరు సంతానం. కొడుకు అభిలాష్ మానసిక వికలాంగుడు. రశిత యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఆమె గత కొంతకాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కడుపునొప్పి భరించలేక రశిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


