● పోలీసులకు టోకరా ఇచ్చిన మందు బాబు
● యువకుడికి వెంబడించి పట్టుకోవడంతో వివాదం
● పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన గిరిజనులు
కల్హేర్ (నారాయణఖేడ్): మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌లో ఓ యువకుడికి బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ప్రస్తుతం బాధితుడు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. కల్హేర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పండరి, ప్రవీణ్ పిట్లం రోడ్డు మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ మేరకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. మద్యం తాగి ఉన్న ఓ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇందిరానగర్ తండాకు చెందిన తులసీరాం అక్కడికి చేరుకుని వివాదాన్ని సర్దిచెప్పేందుకు జోక్యం చేసుకున్నాడు. అయితే, దీనిపై కోపోద్రిక్తులైన పోలీసులు తులసీరాంపై లాఠీలతో దాడి చేశారు. ఈ దాడిలో అతని బలమైన గాయాలయ్యాయి. తమ గ్రామస్తుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఇందిరానగర్ తండా వాసులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్‌ఐ రవిగౌడ్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పు ఎవరిదైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


