మెదక్‌జోన్: వయసుతో సంబంధం లేకుండా 30 నుంచి 40 ఏళ్ల యువతలో కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయని యశోద హాస్పిటల్ సీనియర్ గుండె వైద్య నిపుణులు డా. శశి శ్రీవత్సవ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నడక తప్పనిసరి అని సూచించారు. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించిన గుండెపోటు, ఇతర సమస్యలు ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రావటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, వేళకు నిద్రపోకపోవడం, జంక్‌ఫుడ్ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..
● ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడి కలగడం.
● నొప్పి ఎడమ చెయ్యి, దవడ లేదా వీపునకు వ్యాపించడం.
● కొద్దిపాటి నడకకే అధిక ఆయాసం రావడం.
● విపరీతంగా చెమటలు పట్టడం, కళ్లు తిరగడం.
● గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది గుండెపోటు వచ్చే సూచన కావచ్చని హెచ్చరించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోజూ నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడంతో పాటు, పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఆహారంలో నూనె, ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఇతర వైద్యులు కూడా పాల్గొన్నారు.


