పల్లెకు ప్రజాపాలన | - | Sakshi
Sakshi News home page

పల్లెకు ప్రజాపాలన

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

అభివృద్ధికి పెద్దపీట

గ్రామసభల్లో వినతుల స్వీకరణ సత్వరమే పరిష్కారం సంక్షేమ పథకాలు, అభివృద్ధే లక్ష్యం ఈనెల 31 వరకు మంత్రి పొన్నం గ్రామాల బాట

సమస్యలు మీవి.. పరిష్కారం మాది

హుస్నాబాద్‌: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారు నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు విన్నవించిన సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, 173 గ్రామాలను మంత్రి స్వయంగా సందర్శించి ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. మొదటి విడతగా ఈనెల 31వ తేదీ వరకు గ్రామాల్లో సందర్శించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ‘పల్లె పల్లెలో ప్రజాపాలన..పల్లె పల్లెకు పొన్నం’ అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని సైదాపూర్‌లో పర్యటించారు.

నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి, మౌళిక వసతులు, సంక్షేమం తదితర అంశాలపై గ్రామాల వారీగా సమీక్షించారు. ప్రతి సమస్యనూ రికార్డు చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రజలకు భరోసానిచ్చారు. అర్హులైన వారికి పెన్షన్‌ ఇస్తామని, ఈ నెల 31లోపు నూతన పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హుస్నాబాద్‌ నియోజవర్గానికి వెయ్యి కుట్టు మెషీన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఇల్లు లేని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతామన్నారు. రైతులకు లాభదాయకమైన పంటగా ఆయిల్‌ ఫామ్‌ సాగుపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే సౌర విద్యుత్‌ వినియోగాన్ని ఇంటికి చేరువ చేయడంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో సోలార్‌ ప్యానెల్‌ పెట్టుకునే వారికి రూ.75 వేల సబ్సిడీతో పాటు రూ.2.50 లక్షల రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. మిగులు కరెంట్‌ను విద్యుత్‌ శాఖ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లకు సంబంధించి వచ్చిన నోటీసులను పరిశీలించి అర్హులైన ఓటర్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించారు. గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజా పాలన లక్ష్యాలను ప్రజలకు అందించేలా వారి వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం

గ్రామాల వారీగా ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నాను. లిఖిత పూర్వకంగా దరఖాస్తులు ఇవ్వండి. వాటిని రికార్డు చేసుకొని సమస్యను పరిష్కరిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశాం. హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.

– మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement