గజ్వేల్‌రూరల్: టీయూడబ్ల్యూజే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాతృమూర్తి బషారత్ ఉన్నీసాబేగం అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు గజ్వేల్‌లోని విరాహత్‌అలీ ఇంటికి చేరుకున్నారు. ఉన్నిసాబేగం మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, తదితర నాయకులు పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
ఇద్దరు మృతి
చేగుంట(తూప్రాన్): విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల ప్రవీణ్ (36) వ్యవసాయ పొలం వద్ద గడ్డి తొలగింపు యంత్రంతో గడ్డిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో భూమిపై ఉన్న కేబుల్ తెగిపోగా ప్రవీణ్ విద్యుత్‌షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానిక రైతులు ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
లక్ష్మక్కపల్లి గ్రామంలో..
ములుగు(గజ్వేల్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జూపల్లి పెంటయ్య(62)తన వ్యవసాయ పొలంలో పచ్చి గడ్డి కోస్తూ బోరుమోటారుకు సంబంధించిన సర్వీస్ వైర్‌ను తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై పెంటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


