అడ్డుకున్న గ్రామస్తులు
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామ పెద్ద చెరువు నుంచి అక్రమంగా నీటిని తరలించడాన్ని మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా.. వట్‌పల్లి మండలంలోని బుడ్డాయిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చేపల చెరువులు నింపేందుకు అవసరమైన నీటి కోసం కన్‌సాన్‌పల్లి చెరువు నుంచి కాలువ తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత కాలువలో నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి చేపల చెరువులు నింపుతున్నారు. ఈ విషయం తెలిసిన కన్‌సాన్‌పల్లి గ్రామస్తులు చెరువు నీటిని అక్రమంగా తరలించడంపై నీటి తరలింపును అడ్డుకున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఇరిగేషన్ డీఈ రవి మోహన్ అక్కడికి చేరుకొని చెరువును పరిశీలించారు. ఇప్పటికే చెరువులో నీరు తక్కువగా ఉందని, నీటిని తరలిస్తే పశువులకు తాగునీటి కరువు ఏర్పడుతుందని కన్‌సాన్‌పల్లి గ్రామస్తులు మొర పెట్టుకున్నారు. వెంటనే నీటిని తరలించే కాలువను పూడ్చివేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని డీఈ హెచ్చరించారు. ఆయన వెంట ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.


