ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హుషారు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హుషారు

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

చివరి విడత బిల్లులు మంజూరు

నారాయణఖేడ్‌: ఏడాదికిపైగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ చివరి విడత బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడతల వారీగా జమ చేసినా కేంద్రం మాత్రం తన వాటా నిధులు విడుల చేయకపోవడంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు సైతం పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు విజ్ఞప్తులు చేసింది. ఆలస్యంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇంటి స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు మంజూరు చేసింది. ఇందుకు మొదటగా లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. సొంత స్థలాలు ఉన్న వారిని ఎల్‌–1 కింద, సొంత స్థలాలు లేని వారిని ఎల్‌–2 కింది, ఇతరులను ఎల్‌–3 కింద ఎంపిక చేసింది. ఇలా జిల్లాలో 3,18,435 మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తులు సమర్పించారు. ఇందులో 1,36,821 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో మొదటి కేటగిరీ కింద 16,559 మందిని గుర్తించారు. వీరిలో 15,833 మందికి కలెక్టర్‌ ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 3,010 మంది క్యాన్సిల్‌ అయ్యారు. 3,035 ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి. బేస్‌మెంట్‌ స్థాయిలో 1,125, రూఫ్‌ లెవల్‌లో 615, ఆర్‌సీసీ 2,897 ఇళ్లు ఉన్నాయి. ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసిన వాటిలో ఆయా స్థాయిలు బట్టి బేస్‌మెంట్‌కు రూ.లక్ష, రూఫ్‌లెవల్‌కు రూ.లక్ష, ఆర్‌సీసీకి రూ.1.40 లక్షలు చొప్పున చెల్లింపులు పూర్తి చేశారు.

మున్సిపాలిటీలో చెల్లింపులు..

పూర్తయిన ఇళ్లకు మున్సిపాలిటీలో 526 గృహాల లబ్ధిదారులకు, గ్రామీణ ప్రాంతాల్లో 2,509 ఇళ్ళకు చివరి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మున్సిపాలిటీలోని లబ్ధిదారులకు చివరి విడత బిల్లులు ఇటీవల ఖాతాల్లో జమ చేస్తున్నారు. చివరి విడత కింద మున్సిపాలిటీలోని లబ్ధిదారుకు రూ.1.60లక్షల చొప్పున పూర్తయిన 526 ఇళ్లకు రూ.8.41 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశారు.

గ్రామీణ ప్రాంతాల వారికి ..

కాగా గ్రామీణ ప్రాంతాల్లో 2,509 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. వారికి చివరి విడత బిల్లు రూ.1.40లక్షల చొప్పున రూ.35.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఈనెలాఖరులోగా జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు కేంద్రం రూ.72 వేలు అందిస్తోంది. ఇందులో వీబీ జీ రామ్‌జీ (ఉపాధి పథకం ) ద్వారా రూ.27,600, స్వచ్చ భారత్‌ ద్వారా మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.12వేలు, పీఎం గ్రామీణ అవాస్‌ యోజన కింద రూ.21వేలు ఇతరత్రాలు కలిపి కేంద్రం రూ.72 వేల అందజేస్తుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం చివరి విడత బిల్లుల్లో కలిపి రూ.1.40లక్షలు లబ్దిదారు ఖాతాలో జమ చేస్తుంది. మొత్తమ్మీద రూ.5 లక్షలను పూర్తయ్యే వరకు ఒక ఇంటికి లబ్ధిదారుకు చెల్లిస్తారు.

పట్టణ ప్రాంతాల వారికి రూ.8.41 కోట్లు

గ్రామీణ ప్రాంత లబ్ధిదారుకు రూ.35.12 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement