● మంత్రి తనిఖీలు చేసినా అదే నిర్లక్ష్యం
● జోగిపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ అలసత్వం
ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వైద్యులు విధులకు గైర్హాజరు అవుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు 10.30 గంటలకు వచ్చి 12.30 గంటలకు వెళ్లిపోతున్నారు. విధులకు హాజరు కాకున్నా.. అటెండెన్స్ మాత్రం వేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈనెల 3, 4 తేదీల్లో సూపరింటెండెంట్ విధులకు రాకున్నా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టడాన్ని ఆసుపత్రి సిబ్బందే బట్టబయలు చేయడం విశేషం. ప్రైవేట్ డాక్టర్ విధులు నిర్వహించిన విషయం ఈనెల 2వ తేదీనే సూపరింటెండెంట్ గుర్తించినా చూసీచూడనట్లు వెళ్లడంతో మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఇదే రీతిలో ప్రైవేట్ డాక్టర్‌తో డ్యూటీ చేయించారు.
జోగిపేట(అందోల్): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ సొంత ఇలాఖాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పనితీరు ఇష్టారాజ్యంగా సాగుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. అందోలు నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట ఏరియా ఆసుపత్రిలో 24 మంది వైద్యులు ఉండగా.. విధులకు మాత్రం 8 నుంచి 10 మంది వరకు మాత్రమే హాజరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, వెళ్లిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు 12.30 దాటితే వెళ్లిపోతున్నారని అవుట్ పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ సెలవులపై వెళ్లడం, అజమాయిషీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
మంత్రి, ఉన్నతాధికారులు తనిఖీలు చేసినా...
మంత్రి, ఉన్నతాధికారులు పలుమార్లు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినా వైద్యుల పనితీరులో మార్పురావడంలేదు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనిఖీ చేసిన సమయంలో కేవలం ఒక్క డాక్టరే విధుల్లో ఉండడం 14 మంది గైర్హాజరు కావడంతో వారందరినీ సస్పెండ్ చేయాలని కమిషనర్‌కు ఫోన్ చేసి ఆదేశించినా ఆదేశాలు అమలు కాలేదు. కలెక్టర్ కూడా తనిఖీ చేసి పలువురు డాక్టర్లపై చర్యలు కూడా తీసుకున్నారు. విధులను మరొక ప్రైవేట్ డాక్టర్‌తో చేయించడంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు శివశంకర్‌రెడ్డి, రమేశ్, భవానీలను ఇటీవల రాష్ట్ర కమిషనర్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులు తనిఖీలు చేసినప్పుడల్లా డాక్టర్లు సస్పెండ్ అవుతూనే ఉన్నా.. వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు.
జోగిపేట ఆసుపత్రిలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు సంబంధించిన నివేదికను మంత్రి రాజనర్సింహకు అందజేస్తాం. ఆసుపత్రిలోని సౌకర్యాలపై ఇన్‌పేషెంట్లను అడిగి తెలుసుకున్నాను.
–శ్రీధర్,
డీసీహెచ్‌ఎస్, సంగారెడ్డి
●
సూపరింటెండెంట్ తీరుపై విమర్శలు


