ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పటాన్‌చెరు డివిజన్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల వారీగా కొనసాగుతున్న సుమారు రూ.75 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేసే కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని బ్లాక్‌లిస్ట్ చేసి, అవసరమైతే కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిళ్లలో రాంకీ సంస్థ చెత్త సేకరణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో మంచినీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులు వేగంగా కల్పించాలని ఆదేశించారు. పోచారం, లక్డరం ప్రాంతాల్లో నిర్మించిన నూతన సబ్‌స్టేషన్లను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు జనార్దన్, కుమార్ గౌడ్, ప్రమీల, సుష్మ, సుమలత, డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డీఈ బాల గోపాల్, ఎంపీడీఓలు యాదగిరి, ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్లు వెంకట కిషన్, అజయ్ రెడ్డి, తాన్య, దశరథ్, నరేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ భాస్కరరావు, ఇంజనీరింగ్ ఈఈ సురేష్, డీఈలు కష్ణవేణి, సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


