అమెరికా, ఆస్ట్రేలియాకు రూ.400 మాత్రమే ‘రాఖీ కా రిస్తా, ఇండియా పోస్ట్ కా వాదా’ నినాదంతో ముందుకు సద్వినియోగం చేసుకోవాలి: పోస్టల్ శాఖ అధికారులు
సిద్దిపేటకమాన్: ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడుతూ సోదరి ప్రేమను చాటుతుంటారు. అక్కాచెల్లెళ్లు ఎక్కడ ఉన్న రాఖీ పండుగకు సోదరుల ఇంటికి వెళ్లి రాఖీ కడుతుంటారు. కానీ దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీ పంపాలనుకునే వారికి తపాలా శాఖ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న సోదరులకు రాఖీలు పంపడానికి భారతీయులు ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇండియన్ పోస్టల్ శాఖ ఐటీపీఎస్ (ఇంటర్నేషనల్ ట్రాక్‌డ్ ప్యాకెట్ సర్వీస్) ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా రూ.185 నుంచి రూ.400 వరకు ప్రపంచంలో ఏ దేశానికై నా రాఖీని సురక్షితంగా పంపించవచ్చు. ఈ సేవలను ఆన్‌లైన్‌లో మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే అవకాశం కల్పించింది. ‘‘రాఖీ కా రిస్తా, ఇండియా పోస్ట్ కా వాదా’’ (రాఖీ బంధాన్ని ఇండియా పోస్ట్ బాధ్యతగా తీసుకుంటుంది) అనే నినాదంతో ముందుకు వెళ్తోంది.
220కి పైగా దేశాలకు..
ఇండియా పోస్టల్ శాఖ ఐటీపీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో వేగంగా రాఖీలు డెలివరీ చేస్తారు. మనం పంపాలనుకునే రాఖీని ప్యాక్ చేసి స్థానిక పోస్టాఫీస్‌లో ఐటీపీఎస్ ఫారంను నింపాలి. అందులో మనం ఏ ప్రాంతానికి పంపించాలనే వివరాలు, పూర్తి అడ్రస్ నమోదు చేయాలి. ఇండియన్ పోస్టల్ ద్వారా మనం పంపించే రాఖీలు వారం రోజుల నుంచి పది రోజుల్లో అడ్రస్‌కు చేరుతుంది. దుబాయ్‌కు రూ.185, జర్మనీ రూ.245, కెనడా రూ.360, ఆస్ట్రేలియా రూ.395, అమెరికా వంటి దేశాలకు రూ.400 చార్జీలతో రాఖీలు పంపించవచ్చు. 220కి పైగా దేశాలకు రాఖీలు పంపించే సేవలను ఇండియన్ పోస్టల్ అందిస్తుంది.
రాఖీ పండుగ పాట చిత్రీకరణ
చిన్నకోడూరు(సిద్దిపేట): రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఓ ప్రైవేటు యూనిట్ పాటను సోమవారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో చిత్రీకరించారు. రక్షాబంధన్ ప్రోమో సాంగ్‌ను నటీనటులతో కలిసి గ్రామంలో షూటింగ్ చేశారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.


