క్రషింగ్‌ కోసం కసరత్తు | - | Sakshi
Sakshi News home page

క్రషింగ్‌ కోసం కసరత్తు

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

ప్రయత్నాలు ప్రారంభించిన ట్రైడెంట్‌ యాజమాన్యం రైతుల్లో చిగురించిన ఆశలు సీడీసీ బకాయిల చెల్లింపు కార్మికుల వేతన బకాయిల చెల్లింపులో మాత్రం జాప్యం

జహీరాబాద్‌: జహీరాబాద్‌లోని ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారంలో వచ్చే సీజన్‌కు గాను క్రషింగ్‌ చేపట్టేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇది రైతులకు ఆశలను చిగురింపజేస్తోంది. ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తే సీజన్‌ ప్రారంభమయ్యే నవంబర్‌ నాటికి కర్మాగారం సిద్ధం అవుతుంది. క్రషింగ్‌ చేపట్టేందుకు వీలుగా ఉన్న అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తోంది. సీడీసీకి రావాల్సిన బకాయిలలో ఇప్పటికే కొంత మేర చెల్లింపులు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. క్రషింగ్‌ నిర్వహించేందుకు వీలుగా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం కేన్‌ కౌన్సిల్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. 2026– 27 సీజన్‌కు గాను క్రషింగ్‌ ఎలాగైనా ప్రారంభించాలని యాజమాన్యం గట్టిగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలాలు ప్రీ జోన్‌ కింద ఉన్నాయి. కర్మాగారం క్రషింగ్‌ చేపడితే రెండు మండలాలను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆయా మండలాల్లో సుమారు 5లక్షల టన్నుల మేర చెరుకు పంట ఉత్పత్తి కానుందనే అంచనా. జహీరాబాద్‌ సమీపంలోని కొత్తూరు (బి) గ్రామంలో గల ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం గత మూడు సీజన్ల పాటు మూత పడింది. 2023– 24, 2024– 25, 2025– 26 సీజన్‌కు గాను క్రషింగ్‌ కొనసాగలేదు. దీంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సమస్యలను పరిష్కరించింది. జోన్‌ పరిధిలో ఉన్న చెరుకును పలు కర్మాగారాలకు తరలించారు. కొందరు రైతులు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలను ఆశ్రయించారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం వేతన బకాయిల చెల్లింపులు చేయాల్సి ఉందని కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం. జి. రాములు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుల విషయంలో ఒప్పందం కుదిరినా అమలుకు నోచుకోలేదన్నారు. అన్నీ కలుపుకుని సుమారు రూ.12 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపుల కోసం యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement