దుబ్బాకటౌన్: అక్రమంగా బొలెరోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన దుబ్బాక పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు ఆధ్వర్యంలో ఈనెల 14న మల్లయ్యపల్లికి వెళ్లే రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఎండి సాధిక్, మొహమ్మద్ మురద్ బొలెరోలో 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యం విలువ 60 వేల వరకు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.
బెల్ట్ షాపుల్లో తనిఖీలు
10.77 లీటర్ల మద్యం స్వాధీనం
దుబ్బాకటౌన్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేసి, మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ రాజేశ్, ఎస్‌ఐ కీర్తిరాజు, ఎస్సై సాయిప్రసాద్ ఆధ్వర్యంలో దుంపలపల్లి 4వ వార్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేశారు. కాగా కోల రాజు ఇంట్లో 7.15 లీటర్ల మద్యం, ఉప్పునూతల రవి ఇంట్లో 3.62 లీటర్ల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.


