మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.లక్షల ఆదాయం వచ్చే దుకాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల వైఖరి వల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జహీరాబాద్ టౌన్:
జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి పక్కన భవానీ మందిరం రోడ్డులో 1990లో రూ.46 లక్షల ఖర్చుతో 52 మున్సిపల్ దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. నెలకు రూ.600 అద్దె ప్రాతిపాదికన షాపులను వ్యాపారులకు కేటాయించారు. అధికారులు వ్యాపారులతో కుమ్మకై అగ్రిమెంట్ గడువు ముగిసినా...తక్కువ అద్దె వసూలు చేస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. అగ్రిమెంట్ గడువు ముగిసినందున అద్దె పెంచాలని 2016లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు ఇటీవల డిమాండ్ చేయగా వెంటనే మున్సిపల్ అధికారులు రూ.600 ఉన్న అద్దెను రూ.2,500కు పెంచిన విషయం తెలిసిందే.
బహిరంగ వేలంలో రూ.5వేలు అద్దె
కొత్తగా టెండర్ పిలిచి వేలం పాట ద్వారా దుకాణాలను కేటాయించాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో అప్పట్లో మున్సిపల్ అధికారులు వ్యాపారులచేత దుకాణాలను ఖాళీ చేయించారు. దెబ్బతిన్న దుకాణాలకు రూ.లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు. అనంతరం షాపింక్ క్లాంపెక్స్ దుకాణాలను అద్దె కోసం బహిరంగ వేలం వేశారు. రూ.5 వేల కంటే తక్కువ కాకుండా అద్దె నిర్ణయించారు. 52 దుకాణాలకు గాను ప్రతీ నెల మున్సిపల్‌కు సుమారు రూ.2.60 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వేలం పాటలో దుకాణాలను చేజిక్కించుకున్న కొంతమంది షాపులను స్వాధీనం చేసుకున్నారు. అయితే దుకాణాల అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రూ.లక్షల ఆదాయం వచ్చే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌పై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అద్దె వసూలు చేస్తున్నాం
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలకు సంబంధించి అద్దె వసూలు చేస్తున్నాం. వ్యాపారులకు కేటాయించిన వాటికి అద్దె తీసుకుంటున్నాం. కొన్ని దుకాణాలు దెబ్బతినగా ఖాళీగా ఉన్నాయి. మరమ్మతులు చేపట్టి ఎవరైనా ముందుకు వస్తే కేటాయిస్తాం. ఇటీవలే కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించా. పూర్తి విషయాలు తెలుసుకుని కాంప్లెక్స్ దుకాణాలపై దృష్టి పెడతాం.
– ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌అద్దె వసూళ్లలో జాప్యం
అధికారులు అలసత్వంప్రదర్శిస్తున్నారని విమర్శలు


