జహీరాబాద్: ముదురు మామిడి తోటల పునరుద్ధరణ చేపట్టడం ద్వారా రైతులకు తిరిగి నాణ్యవంతమైన దిగుబడులు సాధ్యపడతాయి. 30 నుంచి 35 ఏళ్ల వయసు పైబడి ఉన్న వాటిని ముదురు మామిడి తోటలుగా పేర్కొంటారు. ముదురు మామిడి తోటల్లో ప్రతీ ఏటా పంట క్షీణించి దిగుబడులు పడిపోతుంటాయి. దీంతో రైతులకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. ఇలాంటి మామిడి తోటలను కత్తిరించడం ద్వారా తిరిగి పంట దిగుబడులను పెంచుకోవచ్చని డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్త జి.శైలజ చెబుతున్నారు.
1,500 ఎకరాల్లో మామిడి తోటలు
సంగారెడ్డి జిల్లాలో సుమారు 1,500 ఎకరాల్లో మామిడి తోటలుసాగులో ఉన్నాయి. కానీ, ఎక్కువ తోటలు 30 నుంచి 40 సంవత్సరాల వయసుకు మించి ఉన్నాయి. దీంతో తోటలు గుబురుగా,ఎత్తుగా పెరగడం వల్ల ఒక చెట్టు కొమ్మలు మరో చెట్టులోకి వెళ్లి గాలి, వెలుతురు ప్రసరించకుండా, సూర్యరశ్మి లోపించడం, చెట్టు లోపలి భాగాలకు ఎండ తగలక పోవడం వల్ల దిగుబడులు రావడం లేదు. తద్వారా పురుగులు, తెగుళ్లు ఎక్కువ వ్యాపించడం, పూత సరిగ్గా రాక పోవడం, ఎండు పుల్లలు ఎక్కువ అవడం కారణంగా పంట కాపు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తోటలను తీసివేసి కొత్త తోటలను నాటుతున్నారు. చెట్లను పూర్తిగా తీసివేయకుండా పునరుద్ధరణ చేసుకోవచ్చు. చెట్లను కత్తిరించడం ద్వారా మళ్లీ చిగురింపజేయవచ్చు. ఇలా చేయడం వల్ల మరో 20 ఏళ్ల వరకు తోటలను ఉంచవచ్చు. కొత్త దిగుబడులు వచ్చే విధంగా తోటలను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను వర్షాకాలంలో జూలై మొదటి వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు చేసుకోవచ్చు.
చెట్ల కొమ్మలు మొత్తం కత్తిరించివేయాలి
చెట్లను అడుగు భాగం నుంచి 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు మొత్తం కత్తిరించి వేయాలి. చెట్టులో ఉన్న ప్రథమ, ద్వితీయ శ్రేణి కొమ్మలు దెబ్బతినకుండా 1 నుంచి 2 అడుగుల వరకు ఉంచి మిగతా కొమ్మలను కత్తిరించి వేయాలి. గొడ్డలికి బదులు రంపం ఉపయోగించాలి. కొమ్మలను వాలుగా కత్తిరించుకోవాలి. దీని వలన వర్షం నీరు పడకుండా, బూజు తెగుళ్లు తగ్గుతాయి.
మందులు పిచికారీ చేసే విధానం
చెట్టు కొమ్మలు తీసివేసిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను 3 గ్రాములు, ఒక లీటరు నీటికి కలుపుకుని కొమ్మలకు పూయాలి. లేదా బోరోడాక్స్ మిశ్రమాన్ని 2 శాతం పిచికారీ చేసుకోవాలి. చెట్టు చుట్టూ పాదులు తయారు చేసి కిలో యూరియా, 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పాస్పరస్, 1.5 కిలోల పొటాష్‌ను సక్రమంగా వేసుకున్నట్లయితే రెండు నెలల్లో చిగురించి, కొత్త కొమ్మలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
ముదురు మామిడి తోటలపునరుద్ధరణే మేలు
మరో 20 ఏళ్ల వరకుమామిడి దిగుబడులు
మూడు సంవత్సరాలకే చేతికి తిరిగి పంట
మూడేళ్ల వరకు అంతర పంటల సాగుకు అవకాశం
బలంగా ఉన్న చిగుళ్లను ఉంచాలి
కొత్తగా చిగుళ్లు వచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో వస్తాయి. బలంగా ఉన్న చిగుర్లను ఉంచి మిగతావి తిన్నింగ్ చేయాలి. ఒకొక్క దిశలో ఒకటి లేదా రెండు కొమ్మలను ఉంచి మిగతావి తీసివేయాలి. అలా ఈ తిన్నింగ్ అనే పద్ధతిని ఒకటి లేదా రెండేళ్లపాటు చేయాలి. ఇలా కత్తిరించిన చెట్టుకు కొత్త కొమ్మలు వచ్చి పంట రావడానికి 3 ఏళ్లు పడుతుంది. ఇలా రైతులు మరో 20 ఏళ్ల వరకు అధిక దిగుబడిని సాధించవచ్చు. రైతులు సమయం వృథా చేయకుండా కత్తిరించిన మామిడి చెట్ల మధ్యలో అంతర పంటలుగా కూరగాయలు, అపరాలు వేసుకోవచ్చు.


