మహిళల్లో ఉల్లాస్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళల్లో ఉల్లాస్‌

Jun 19 2026 7:51 AM | Updated on Jun 19 2026 7:51 AM

21వేల మందికి శిక్షణ.. 17,514 మంది ఉత్తీర్ణత విద్యకు వయసు అడ్డుకాదని నిరూపిస్తున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు

సాక్షి, సిద్దిపేట: చదువుకు వయసు అడ్డుకాదని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు నిరూపిస్తున్నారు. ప్రతీ మహిళా అక్షరజ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఇన్‌ సొసైటీ)కు శ్రీకారం చూట్టింది. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్‌ ఉమ్మడి భాగస్వామ్యంతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ఆరు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ శిక్షణ పూర్తయ్యాక మార్చి 29న ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌(ఫ్లాంట్‌) పరీక్ష నిర్వహించింది. ఇందులో 56,431 మంది మహిళలు ఉత్తీర్ణత సాధించారు.

49 వేల ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49,850 ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లుండగా 5,11,624 సభ్యులున్నారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో 50శాతం మందికి మాత్రమే సంతకం చేయడం వచ్చని, మిగిలిన సగం వారు వేలిముద్రలు వేస్తున్నారని సెర్ప్‌ వారి దగ్గర ఉన్న సమాచారం. సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం.

ఆరు నెలలు శిక్షణ

వయోజన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడమే కాకుండా మధ్యలో బడిమానేసిన వారిని సైతం గుర్తించి నేరుగా ఓపెన్‌ టెన్త్‌, ఆసక్తి ఉంటే ఓపెన్‌ డిగ్రీ చదివించనున్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా 63వేల మంది మహిళా సంఘాల సభ్యులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను అందించి నేర్పించారు. మహిళలు చదవడం, రాయడంతోపాటు బ్యాకింగ్‌ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను నేర్పించారు.

మొదటి అడుగు సక్సెస్‌

ఆరు నెలల పాటు శిక్షణ పొంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చదువులో మొదటి అడుగు వేశారు. మొత్తంగా 63,405 మంది పరీక్ష రాయగా 56,431(89 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 6,971 మంది ఫ్లాంట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారు. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్ష రాయించాలని సెర్ప్‌ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఓపెన్‌ టెన్త్‌ పరీక్ష రాసేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నారు.

జిల్లా పరీక్ష రాసిన వారు ఉత్తీర్ణులైన వారు

సిద్దిపేట 21,112 17,514

సంగారెడ్డి 27,911 25.672

మెదక్‌ 14,382 13,245

అమ్మకు అక్షరం.. అభ్యాసం వేగిరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement