కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: ఈ నెల 21న నిర్వహించే నీట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాల్లో 2,924 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.
కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
నీట్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. పరీక్ష నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్రాల వద్ద ఎలాంటి సిగ్నల్స్ రాకుండా ఉండేందుకు జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దోస్త్ ప్రక్రియ పొడిగింపు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దోస్త్ మూడో విడుత అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 21 వరకు పొడిగించినట్లు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సునీత తెలిపారు. గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ మాట్లా డుతూ మొదటి, రెండో విడతలో సీట్లు రాని విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్‌లో ఈ నెల 21 వరకు దరఖాస్తు, 22 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వవచ్చాన్నారు. జూన్ 25న సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. జూన్ 26 నుంచి జూలై 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, జూలై 4 వరకు కళాశాలలో ద్రువపత్రాలను సమర్పించి సీటును దృవీకరించుకోవాలన్నారు. వివరాలకు కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.


