నంగునూరు(సిద్దిపేట): దరఖాస్తు పరిశీలన కోసం వచ్చిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన గురువారం సీతారాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుంగ అంకుశ్ నాల కన్వర్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఆర్‌ఐ బాలకృష్ణమూర్తి, జీపీఓ రమేశ్ గ్రామానికి చెరుకొని భూమిని పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన జక్కుల మధు, కొంపల్లి శ్రీనివాస్ దుర్భాషలాడుతూ ఆర్‌పై దాడి చేశారు. విధులకు ఆటంకం కల్గిస్తూ అధికారులపై దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్ తెలిపారు.
గజ్వేల్: షాద్‌నగర్‌లో ఈనెల 13, 14తేదీల్లో నిర్వహించిన అండర్–15 బాక్సింగ్ పోటీల్లో జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన విద్యార్థిని మోక్ష అత్యుత్తమ ప్రతిభతో కాంస్య పతకం సాధించారు. మేడ్చల్–మల్కాజిగిరి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువతున్న ఈ బాలిక.. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడంతో గామస్తులు అభినందించారు.
సంఘం రాష్ట్ర నేత భానుప్రసాద్
సిద్దిపేటజోన్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం నాయ్యం చేయాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర నాయకుడు భానుప్రసాద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. 21న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మలిదశ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యమకారులకు ప్రభుత్వం 250 గజాల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం, గుర్తింపు కార్డులు, ఫించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కమిటీ చైర్మన్ కేశవరావు సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సూరయ్య, యాదగిరి, మహేందర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని మృత దేహాన్ని గ్రామస్తులు గమనించారు. ఎస్‌ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామశివారులోని శ్మశానవాటిక వెనుకగల పొలాల్లో ఒకవ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గురువారం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని గుర్తించలేక పోయారు. పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 87126 67326 నంబర్‌కు సమాచారం తెలియజేయాలని ఎస్‌ఐ సూచించారు.
మనుబోతుపై చిరుత దాడి
రామాయంపేట(మెదక్): చిరుత దాడిలో మనుబోతు గాయపడింది. మండలంలోని తొనిగండ్ల అటవీ ప్రాంతంలోని చెరువు వద్దకు గురువారం రాగా, గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ అధికారులు పట్టుకొని చికిత్స నిమిత్తం స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం మనుబోతును అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు.


