డీడీఎస్ ఈడీ దివ్య, కేవీకే శాస్త్రవేత వరప్రసాద్
జహీరాబాద్: తేనెటీగల పెంపకంతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని డీడీఎస్ ఈడీ దివ్య, కేవీకే శాస్త్రవేత్త వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల కేవీకేలో తేనెటీగల పెంపకంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. యువతీయవకులు సైతం ముందుకొచ్చి ఈ రంగంపై ఆసక్తి చూపాలన్నారు. రసాయనిక మందులను వాడడంతో తేనెటీగలు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తేనెటీగలు లేకపోతే పరపరాగ సంపర్కంపై ప్రభావం చూపించి పంట దిగుబడులు పడిపోతాయన్నారు. దీంతో ఆహారం కొరత ఏర్పడి మానవ మనుగడకు ముప్పువచ్చే పరిస్థితి కలుగుతుందన్నారు. కావున వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తేనెటీగల పెంపకం ద్వారా అనేక లాభాలు పొందవచ్చన్నారు. తేనెతో పాటు మైనం, పుప్పడి, రాజహారం, ప్రొపొలిస్, తేనె ముల్లు విషం కూడ తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి పండరి మాట్లాడుతూ తేనెటీగల శిక్షణ పొందిన తర్వాత డీఆర్‌డీఏ పథకం ద్వారా తేనెపట్టును 40 శాతం సబ్సిడీతో బాక్సులను రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత స్నేహలత, నిపుణులు పరిపూర్ణ, కీపర్, రైతులు, యువతీ యువకులు పాల్గొన్నారు.


