● అధికారులు పద్ధతి మార్చుకోవాలి
● మెదక్ ఎంపీ రఘునందన్ రావు
మిరుదొడ్డి(దుబ్బాక): రెవెన్యూ అధికారులు లంచాలకు కక్కుర్తి పడితే చర్యలు తప్పవని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ఘాటుగా హెచ్చరించారు. మండల పరిధిలోని మల్లుపల్లిలో గురువారం రూ.30 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదంటూ గ్రామస్తులు ఎంపీ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట ఆర్డీఓకు ఫోన్ చేసి మాట్లాడారు. మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాయలంలో జరుగుతున్న లంచం తతంగంపై ఆర్డీఓకు చేరవేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యంతో పాటు, పౌతీ చేయడానికి ఇక్కడి అధికారులు లంచం అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారంపై అధికారులు పద్ధతి మార్చుకోవాలన్నారు. లేదంటే తానే రంగంలోకి దిగి ఏసీబీ అధికారులకు పట్టిస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కనకరాజు, బీజేపీ నాయకులు భిక్షపతి, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


