తల్లి, కుమారుడు..
పటాన్‌చెరు టౌన్: తల్లి, కుమారుడు అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకి చెందిన పవన్ బతుకుదెరువు కోసం వలస వచ్చి, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో నివాసముంటున్నాడు. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం అతని భార్య మొని, కుమారుడు దేవజిత్ ఇద్దరూ ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. రాత్రి ఇంటికి వచ్చిన పవన్.. భార్యాపిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది, స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో భార్య, కుమారుడి అదృశ్యంపై భర్త పవన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మార్కెట్‌కు వెళ్లిన వివాహిత...
పటాన్‌చెరు టౌన్: మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధానూర్‌కు చెందిన రత్నకుమారి(23) బుధవారం బీహెచ్‌ఈఎల్ మార్కెట్‌లో చేపలు విక్రయించే తన తల్లి కోటమ్మ వద్దకు వెళ్లేందుకు బస్సు లో బయలుదేరింది. అయితే బీహెచ్‌ఈఎల్ మార్కెట్‌కు వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన బంధువులు, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే ఆమె భర్త కోటేశ్వరరావు గురువారం బీడీఎల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడు...
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన బెల్ టౌన్‌షిప్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెల్ కాలనీలో నివాసం ఉండే 65ఏళ్ల బాబురావుకు మతిస్థిమితం సరిగా లేదని, బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదన్నారు. అయితే అతని కోసం ఆరా తీసిన ఆచూకీ లభించలేదన్నారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


