శివ్వంపేట(నర్సాపూర్): ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మండల పరిధి పిల్లుట్లకు చెందిన ముండ్రాతి భాస్కర్ గురువారం నర్సాపూర్‌లో తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకున్నాడు. నర్సాపూర్ బస్టాండ్‌లో గజ్వేల్ బస్సు ఎక్కి శివ్వంపేటకు వెళ్తుండగా.. చిన్నగొట్టిముక్ల వద్ద తన జేబులోని డబ్బులు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శివ్వంపేట వద్ద బస్సుని నిలిపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయినా డబ్బులు లభ్యం కాలేదు. నర్సాపూర్‌లో బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఉండడంతో అక్కడే గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు చోరీ చేసి ఉండొచ్చని ప్రయాణికులు తెలిపారు. అప్పు చెల్లించేందుకు బంగారం తాకట్టు పెట్టి తెస్తున్న డబ్బులు చోరీకి గురికావడంతో బాధితుడి రోదన ప్రయాణికులను కంటతడి పెట్టించింది.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కౌడిపల్లి(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారు. గురువారం స్థానిక ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పీర్లతండా పంచాయతీ పరిధిలోని కొయ్యగుండుతండాకు చెందిన కాట్రోత్ రాజు, అతని భార్య, కొడుకు ఇంటికి తాళం వేసి పొలం పనులు, సొంత పనులపై బయటకు వెళ్లారు. మధ్యాహ్నం అతని కొడుకు ఇంటికి వచ్చిచూడగా ఇంటితాళం, బీరువా తాళం పగులగొట్టి కనిపించింది. బీరువాలోని 20తులాల వెండి పట్టగొలుసులు, రూ.10వేలు నగదుతో పాటు ఎస్‌బీఐ గోల్డ్‌లోన్ పత్రాలు, బైక్ ఆర్‌సీ ఇతర పత్రాలను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


