టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
ఎస్‌బీఐ శిక్షణ సంస్థ అభ్యర్థులకు
సర్టిఫికెట్లు ప్రదానం
శిక్షణ తీసుకున్న మహిళలతో నిర్మలారెడ్డి
సంగారెడ్డి: స్వశక్తితో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదిగాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అమ్మవారి గెటప్, భారతమాత గెటప్‌తో పాటు వివిధ సాంప్రదాయ అలంకరణలతో శిక్షణార్థినులు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళ స్వయం శక్తితో ఎదిగి ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించాలని, తమ హక్కుల కోసం నిలబడాలని సూచించారు. మధ్యలో వదిలేయకుండా నిరంతరం సాధన చేస్తూ స్వయం ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. డైరెక్టర్ ఎం.రాజేష్ కుమార్ సంస్థ కార్యకలాపాలు, శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్ నాయక్, సంస్థ కో–ఆర్డినేటర్లు శివశంకర్, నర్సింలు, జేఆర్‌పీ లక్ష్మిప్రియ, దుర్గ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


