పటాన్‌న్‌చెరు టౌన్: మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు అర్థరహితమని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట తప్పిన మీకు మాట్లాడే హక్కు లేదన్నారు. ఇందిరా, సోనియా గాంధీ పేర్లు జపిస్తే డబ్బులు వస్తాయా? అని ఎంపీ మాట్లాడడం అర్థరహితమని విమర్శించారు. ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన సమయంలో దూరదృష్టితో బీడీఎల్, ఆర్డినెనన్స్ ఫ్యాక్టరీ, మహీంద్రా, ఆల్విన్ వంటి పరిశ్రమలు జిల్లాకు వచ్చాయన్నారు. ఈ కంపెనీలతో వేలాది మందికి ఉపాధి లభించిందని గుర్తుచేశారు. అదే విధంగా సోనియా యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో కంది ఐఐటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, నిమ్జ్ వంటి ప్రాజెక్టులు రావడంతో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి జిల్లాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన విద్యాసంస్థలకు కూడా కేంద్ర బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు హామీని ఎంపీ రఘునందన్ రావు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, యువరాజ్, శ్రీనివాస్, రతన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిర, సోనియాపై ఎంపీ రఘునందన్
వ్యాఖ్యలు అర్థరహితం
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు
నర్సింహారెడ్డి


