న్యూస్‌రీల్
సంగారెడ్డి ప్రధాన రహదారిపైఏరులై పారుతున్న మురికినీరు
సంగారెడ్డి/నారాయణఖేడ్/ఝరాసంగం: జిల్లాలో ఆదివారం పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులు వీయడంతో చెట్లు నేల కూలాయి. సంగారెడ్డిలో భారీ వర్షం కురవగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారి వెంబడి మొత్తం నాళాలు ఉప్పొంగి మురికి నీరు రోడ్లపై ప్రవహించింది. ఖేడ్‌లో ఉదయం ఎండ వేడిమి కనిపించినా ఖేడ్ ప్రాంతంలో మధ్యాహ్నాం 3 గంటలకు వర్షం మొదలైంది. సుమారు అరగంటపాటు ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురిసింది. ఖేడ్– హంగిర్గా శివారులో పలు చెట్లు నేలకూలాయి. ఖేడ్ మండలంలోని నాగల్ గిద్దలో 11.5, ఖేడ్‌లో 4.3, సంగారెడ్డి 29.3, కొండాపూర్ 24, జిన్నారం 20.8, హత్నూర 18.3, అమీన్‌పూర్ 14.0, కంది 12.5, గుమ్మడిదలలో 6.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఝరాసంగం, జీర్లపల్లి, బొప్పాన్ తదితర గ్రామాల్లో బలమైన ఈదురుగాలులు వీచి భారీ వృక్షాలు నేలకూలాయి. ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి.
వాతావరణంలో మార్పులు..
ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వర్షాలు కురిసినా పలు ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండవని పేర్కొంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
కురుస్తున్న వర్షం


