న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు పెంపకాన్ని కూడా చేడుతున్నారు. సర్పంచ్‌లు, గ్రామస్తులు సహకారంతో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బడుల ఆవరణలో మొక్కల పెంపకం చేపట్టడంతో పలు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గతంలో వేసిన మొక్కలు ఏపుగా పెరగడం వల్ల ఆయా పాఠశాలలు అందంగా, ఆహ్లాదకరంగా మారాయి. మొక్కలకు సమృద్ధిగా నీరు అందిస్తుండటంతో పాఠశాలల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగి చల్లదనంతోపాటు విద్యార్థుల శారీక, మానసిక వికాసానికి నిలయాలుగా మారాయి.
కంది, రాయికోడ్ మండలాల్లో...
జిల్లాలో మొత్తం 1,262 పాఠశాలలు ఉండగా అందులో 864 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల ఆవరణలో సుమారు 90వేల వరకు మొక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి, ఎద్దుమైలారం, రాయికోడ్ మండలంలోని కర్చల్, రాయికోడ్, కోడూర్, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్ పేట్, న్యాల్‌కల్ మండలంలోని టేకూర్, చీకూర్తి, బసంత్‌పూర్, మామిడ్గి, ముంగి, చాల్కి, జహీరాబాద్ మండలంలోని రాయిపల్లితండా, మొగుడంపల్లి తదితర పాఠశాలల ఆవరణలో పచ్చని మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఈసారి కూడా మొక్కలు నాటే కార్యక్రమం
నర్సరీల నుంచి తెచ్చిన జామ, మామిడి, ములక్కాయ, కానుగ, టేకు, కొబ్బరి, దానిమ్మ తదితర రకాల మొక్కను పాఠశాలల ఆవరణలో నాటారు. గతేడాది ఆయా పాఠశాలల ఆవరణలో సుమారు 40వేల మొక్కలు నాటగా, ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. చీకూర్తి జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో దాదాపు 350కిపైగా మొక్కలు నాటారు. గత ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రత్యేకశ్రద్ధ తీసుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. వాటికి నిత్యం బోరు ద్వారా నీటిని అందించడంతో అవి ఏపుగా పెరిగాయి. ఖాళీ సమయంలో విద్యార్థులు చెట్ల కింద చదువుకునేందుకు మంచి వాతావరణం నెలకొంది. టేకూర్, బసంత్‌పూర్, మామిడ్గి తదితర పాఠశాలల ఆవరణలో కూడా పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి విద్యార్థులకు చల్లదనాన్ని పంచుతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులకు చల్లగా ఉన్న చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల మాదిరిగానే మిగతా పాఠశాలల్లో కూడా మొక్కలను పెంచితే ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆహ్లాదకరంగా సర్కారీ బడులు
మొక్కల పెంపకంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ
చెట్లకిందే వేసవి తరగతుల నిర్వహణ


