‘పేట’తహసీల్ అవినీతిమయం
పైసా వసూల్...
జిల్లాలో రెవెన్యూలో కార్యాలయాల్లో అవినీతికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. మండలాల్లో తహసీల్దారు కార్యాలయానికి భూ సమస్యల పరిష్కారం కోసం వెళ్లేవారిని కొందరు ఉద్యోగులు డబ్బుల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ప్రతీ పనికి పైసలు చేతిలో పడితేనే ఫైలు ముందుకు కదులుతోంది. లేదంటే రకరకాల కొర్రీలు పెట్టి నెలల తరబడి ఆ ఫైళ్లు మూలకు చేరిపోవడం బహిరంగ రహస్యమే. గతంలో సదాశివపేటలో పని చేసిన పలువురు రెవెన్యూ అధికారులు భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి రియల్టర్ల వద్ద భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన అధికారుల తీరుతో ప్రస్తుతం మండల, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు కొత్తగా రావడంతో వారు ప్రతీ ఫైల్‌ను తిరిగి నిశితంగా పరిశీలిస్తుండటం, తిరిగి దరఖాస్తులు చేసుకోమనడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నకిలీ పౌతి మార్పు జరిగిన నందికంది శివారులోని భూమి
తప్పు చేయడం... సరిదిద్దడం సదాశివపేట రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. ఎంతమంది పాలకులు మారినా.. రెవెన్యూ శాఖలో అవినీతికి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఏ పని జరగాలన్నా ఆయా ఉద్యోగులస్థాయిని, సంబంధిత పనినిబట్టి లంచం డిమాండ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నా, కేసులు నమోదవుతున్నా. లంచాలు తీసుకోవడానికి మాత్రంజంకడం లేదు. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి):
సదాశివపేట మండలంలోని నందికంది శివారులో ముంబై జాతీయ రహదారికి ఆనుకోని ఉన్న 298(అ) సర్వే నంబర్‌లో ఉన్న దాదాపు రూ. 100కోట్ల విలువ గల 9.13 ఎకరాల పట్టా భూమిపై భూ మాఫియా కన్ను పడిన విషయం తెలిసిందే. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే దురాశతో పట్టాదారు బతికి ఉండగానే మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రాలు, నకిలీ ఆధారాలను సృష్టించి పౌతి మార్పు కూడా చేసేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నకిలీ పౌతి జరిగినట్లు నిర్ధారించి తాజాగా పౌతి మార్పును రద్దు చేసి తిరిగి ఆ భూమిని అసలు పట్టాదారుడైన రవిశంకర్ పేరుమీదికి మార్చారు.
గతంలోనూ ఇంతే...
సదాశివపేట మండలంలో గతంలోను పలు అక్రమలావాదేవీలు జరిగా యి. ఇందులో మండలంలోని మరో రెండు గ్రామాల్లోను గతంలో నకిలీ పౌతి చేసేశారు. తర్వాత అసలు పట్టాదారులు వచ్చి గోల చేయడంతో దాన్ని సరిచేశారు. ఓ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి పేరిట వ్యవసాయేతర
అవసరాల నిమిత్తం మార్పు చేశారు. కాగా, ఓ గ్రా మ పరిధిలో ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన భూమికి నకిలీ వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేయడం జరిగింది. ఇలా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ పౌతిలు, మ్యూటే షన్, నకిలీ భూ యజమానుల పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేశారు. తప్పు చేయడం, సరిదిద్దుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఇ లాంటి అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని, అదేవిధంగా భూ మాఫియాకు పాల్పడుతు న్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా అక్రమ పౌతినిరద్దు చేసిన అధికారులు
గతంలో నకిలీ పత్రాలు సృష్టించిపౌతి మార్పు
అధికారులపై చర్యలు శూన్యం
అక్రమార్కులపై చర్యలేవి..?
రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న భూ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భూ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నందికంది నకిలీ పౌతి వ్యవహారంలో దాదాపుగా రూ.3కోట్ల వరకు చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవహారంలో క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్న జీపీవో(రెవెన్యూ)ను వదిలేసి కేవలం ఆర్‌ఐను సస్పెండ్ చేయడం, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌పై తూతూమంత్రంగా బదిలీ వేటు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.


