‘పాడి’తో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

‘పాడి’తో ఉపాధి

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

● మొగ్గు చూపుతున్న గ్రామీణ యువత ● ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలన్న రైతులు

జహీరాబాద్‌ టౌన్‌: పాల ఉత్పత్తులు రోజు రోజుకు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇంటి అవసరాలను సమకూర్చుకుంటూ మిగతా పాలను విక్రయిస్తున్నారు. ఆదాయం కూడా వస్తుండటంతో యువత పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమలతో సమూల మార్పు తీసుకొచ్చింది. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా గేదెలను పెంచుకుంటూ పాలను విక్రయించి ఉపాధి పొందుతున్నారు.

జహీరాబాద్‌లో వందకు పైగా డెయిరీలు..

జహీరాబాద్‌ ప్రాంతంలో సుమారు వంద వరకు డెయిరీ ఫాంలు ఉన్నాయి. షెడ్లు నిర్మించుకొని 20 నుంచి 30 వరకు పశువులను పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఒకటి రెండు గేదెలను పెంచుకుంటూ పాలను విక్రయిస్తున్నారు. డెయిరీల నిర్వాహకులు, రైతులు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీతో పాటు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు డెయిరీల వద్ద పాలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్క డెయిరీ ఫాంలో ప్రతి రోజు వంద లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నారు. డెయిరీ నిర్వాహకులు లీటరుకు రూ. 70 చొప్పున అమ్మగా వ్యాపారులు లీటరుకు రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. గేదెలకు పచ్చిగడ్డి అవసరం కాగా డెయిరీ నిర్వాహకులు అక్కడే పశుగ్రాసం సాగు చేస్తున్నారు. పశుగ్రాసంతో పాటు దాణా కూడా పెడుతున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు..

అనేక కారణాల వల్ల పశుపోషణ భారంగా మారిందని, లాభాలు అంతంత మాత్రం వస్తున్నాయని కొంత మంది డెయిరీ నిర్వాహకులు వాపోతున్నారు. పాడి పశువుల ధరలు, పశుగ్రాసం సాగు, దాణ, గేదెల పోషణ, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయని పాడి రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాలు అమ్మినా గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా పోత్సాహకాలు అందడం లేదని డెయిరీ నిర్వాహకులు విష్ణు వాపోయారు. అలాగే స్థానికంగా ఉన్న డెయిరీ కంపెనీలు పాలను తీసుకోవడం లేదని తెలిపారు. లీటర్‌ పాలు రూ.వందకు అమ్మితే గిట్టుబాటు అవుతుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement