భారీగా తగ్గిన దిగుబడి
● ఆదుకోని ప్రభుత్వం
మునిపల్లి(అందోల్): వ్యవసాయం చేసే రైతన్న కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యాన, వాణిజ్య పంటల సాగు చేసినా అన్నదాతకు నష్టమే వస్తోంది. పంట దిగుబడి కోసం చేసిన కష్టమంతా చేనులోనే బూడిదవుతుంది. మిరప సాగు చేసిన రైతన్నలదీ ఇదే పరిస్థితి. తెగుళ్ల దెబ్బకు మిర్చి పంట చిన్నబోయింది. ఓ వైపు దిగుబడి రాక, మరో వైపు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు అప్పులపాలవుతున్నారు. కష్ట, నష్టాలకు ఓర్చి మిరప సాగు చేస్తే తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది.
జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో మిరప పంటను రైతులు సాగు చేశారు. విత్తనాల నుంచి పైరు సాగు వరకు రైతులు పంటకు వివిధ రకాల మందులను పిచికారీ చేశారు. కానీ పంట ఎదుగుదల ఉన్నా అంతగా పూత, కాత, కాయలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరప పంటకు సోకిన నల్లి తెగులు వల్ల వారానికి రెండు సార్లు రైతులు పురుగు మందులు పిచికారీ చేశారు. అయినా దిగుబడి సరిగా రాక, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.


