అప్రమత్తతతో అగ్ని ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో అగ్ని ప్రమాదాల నివారణ

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

జోగిపేట అగ్నిమాపకశాఖ అధికారి

జోగిపేట అగ్నిమాపకశాఖ అధికారి

జోగిపేట(అందోల్‌): చిన్న చిట్కాలతో పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని జోగిపేట అగ్నిమాపకశాఖ అధికారి టి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జోగిపేటలోని నారాయణి షాపింగ్‌ మాల్‌, మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇళ్లలో గ్యాస్‌ లీకై మంటలు వచ్చినప్పుడు పారిపోకుండా మంట వచ్చే ప్రదేశంలో వేలు అడ్డుగా పెట్టి ఆర్పివేయాలన్నారు. తడి బెడ్‌ షీట్‌ను సిలిండర్‌ చుట్టూ కప్పినా ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపారు. అలాగే చిన్న ప్లాస్టిక్‌ బకెట్‌ను తీసుకొని దానిపై మూసివేస్తే కూడా మంటలు ఆరిపోతాయన్నారు. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ వ్యాపించడం వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుందని, భూమిపై చేతులతో నడుస్తూ బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల అప్రమత్తత ఎంతో ముఖ్యమని సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వాణి, షాపింగ్‌ మాల్‌ మేనేజర్‌ పండరి, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement