నారాయణఖేడ్: నిమ్మకాయ ధరలు కొండెక్కాయి. వేసవి కాలం కావడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో ధరలు పెరిగాయి. సాధారణంగా కిలో నిమ్మ కాయలు రూ. 30 నుంచి రూ.50 వరకు పలుకగా నారాయణఖేడ్‌లో ఆదివారం కిలో రూ.200 పలికాయి. ఒక్కో నిమ్మకాయను రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇన్నాళ్లూ రూ.10కి రెండు, మూడు చొప్పున విక్రయించిన వ్యాపారులు ప్రస్తుతం రూ.10కి ఒక్కటి చొప్పున విక్రయిస్తున్నారు. స్థానికంగా చెట్లకు కాత తక్కువగా ఉండటం మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో వీటి ధరలు పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నిమ్మకు సైతం ధర అధికంగా ఉండటంతో వ్యాపారులు ధరలను పెంచి విక్రయిస్తున్నారు.


