● 45రోజుల్లో ప్రభుత్వ ఆధీనంలోకి ● సర్వే నిర్వహణకు ఆరు ప్రత్యేక బృందాలు ● పనుల పురోగతిపై రోజు వారీగా సమీక్ష
రూ.2,369 కోట్ల నిధులతో
అభివృద్ధి పనులు
హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రహదారులు, వాటర్ ట్యాంకులు, గ్రీనరీ, పరిశ్రమల ఏర్పాటుకు స్థలం, విద్యుత్తు, డ్రైనేజీ, తదితర మౌలిక అభివృద్ధి పనులు చేపట్టారు. మొదటి దశలో సేకరించిన భూమిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2,369 కోట్ల నిధులతో పనులు చేపడతారు.
మారనున్న రూపురేఖలు
నిమ్జ్ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీ పనులు పూర్తయితే ఇక్కడి ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. 12,500 ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పరిశ్రమల రాకతో సుమారు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
సంగారెడ్డి జోన్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులు మరింత వేగవంతం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరిలో టెండర్ ప్రక్రియ ముగిసింది. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల నిర్వహణకు మాస్టర్ ప్లాన్‌ను కూడా రూపొందించారు. భూ సేకరణ పూర్తయినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేస్తున్న సమయంలో రైతుల నుంచి వివిధ కారణాలతో వ్యతిరేకత రావటంతో పనులు అంతంతమాత్రంగానే సాగాయి. స్థానిక అధికారులు సరైన చొరవ చూపకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.
పనుల జాప్యంపై సీఈఓ అసంతృప్తి
ఐదురోజుల క్రితం నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాంతంలోని స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో రజత్‌కుమార్ సైని, టీజీఐఐసీ, జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. టెండర్ ప్రక్రియ ముగిసి మూడు నెలలు పూర్తి కావస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగకపోవడం పట్ల స్థానిక అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు సాగకపోవడం పట్ల గల కారణాలను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ప్రత్యేక బృందాలతో భూముల సర్వే
స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన భూములలో సర్వే పనులు ముమ్మరం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. రెండురోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్‌లో రెవెన్యూ, పోలీస్, సర్వేయర్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో సేకరించిన భూమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. 45 రోజుల్లో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఓ వైపు అధికారులు సర్వే పనులు చేస్తుండగా మరోవైపు కాంట్రాక్టర్ భూమిని పూర్తిగా చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పంటలు సాగులో ఉంటే కోత పూర్తి చేసేందుకు గడువు ఇవ్వనున్నారు. ఎక్కువ నెలలపాటు సాగయ్యే పంటలు ఉంటే గుర్తించి పరిహారం అందించి స్వాధీన పరుచుకోనున్నారు. సర్వే నిర్వాహణపై రోజువారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
చదును చేస్తున్న గుట్ట
భూ సేకరణకు నోటిఫికేషన్
నిమ్జ్ మొదటి విడతలో గుర్తించిన 3,245 ఎకరాల్లో ఎల్గోయి గ్రామ పరిధిలో 194 ఇంకా సేకరణ పూర్తి కాలేదు. అందుకుగాను ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి, భూ సేకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని ముంగి గ్రామ శివారులో కొనసాగుతున్న నిమ్జ్ ఏర్పాటు పనులను శనివారం ముంగి తండా వాసులు అడ్డుకున్నారు. తండా సమీపంలో నిమ్జ్ ఏర్పాటులో భాగంగా అందుకు సంబంధించిన హద్దులు ఏర్పాటు, కంచె నిర్మాణం తదితర పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న తండా వాసులు అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పనులు చేస్తున్న వారితో పాటు అధికారులతో తండా వాసులు వాగ్వావాదానికి దిగారు. తహసీల్దార్ ప్రభు, ఆర్‌ఐ శ్యామ్‌రావు తదితరులు వారికి ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా అధికారులకు తండా వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో చాందీబాయి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోగా వెంటనే 108లో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అక్కడకు చేరుకుని తండా వాసులతో మాట్లాడారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే రాసి ఇవ్వాలని, పనులను మాత్రం అడ్డుకోవద్దని నచ్చజెప్పారు. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ వెంట హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ సిబ్బంది ఉన్నారు.


