మక్కలకు ప్రైవేట్‌లో రూ.1,800కు మించని ధర
ఎంఎస్‌పీ రాకపోతే నష్టమంటున్న రైతులు
వట్‌పల్లి(అందోల్): ప్రభుత్వం మొక్కజొన్న (మక్కలు) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందా? తమ పంటకు మద్దతు ధర దక్కుతుందా? లేదా? అని మొక్కజొన్న రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్ల క్రితం వరుసగా యాసంగి, వర్షాకాలాల్లో ఒకే వరి పంటను సాగుచేయగా పంట దిగుబడిపై ప్రభావం చూపడంతో గతేడాది నుంచి రైతులు బోరుబావుల వద్ద మొక్కజొన్న పంటను సాగుచేశారు. ప్రభుత్వ మద్దతు ధర దక్కకపోయినా రైతులకు లాభాలు తెచ్చిపెట్టడంతో ఈ ఏడాది కూడా అందోల్ మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. జోగిపేట ఏడీఏ పరిధిలో సుమారుగా 550పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.
మద్దతు ధర కోసం ఎదురుచూపు..
ఈ ఏడాది దిగుబడులు బాగున్నా సరైన మద్దతు ధర దక్కుతుందా లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాళుకు రూ.2,400 ఉండగా ప్రస్తుతం వ్యాపారులు ఏ మేరకు ధరను చెల్లిస్తారోనని రైతులు మధన పడుతున్నారు. గతేడాది నుంచి రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ప్రైవేట్ ధరకు విక్రయిస్తే మాత్రం తాము నష్టపోతామంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల మండలాల రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు మద్దతు ధర దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో సదాశివపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా అక్కడికి పంటను తరలించడంలో దూరాభారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడాల్సివచ్చిందని గుర్తు చేస్తున్నారు.
విన్నవించేందుకు రైతులు సిద్ధం
అందోల్ మండలంలో అత్యధికంగా కన్‌సాన్‌పల్లి గ్రామంలో మొక్కజొన్న పంట సాగువుతోంది. ఇప్పటికే అదే గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు సంగారెడ్డిలోని మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ప్రైవేట్‌లో రూ.1,800 మించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. ప్రైవేట్‌లో విక్రయిస్తే నష్టపోతాం. జోగిపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.
– రామన్నగారి కిష్టయ్య,
రైతు,కన్‌సాన్‌పల్లి
మంత్రిని కలిసి వినతి..
జోగిపేటలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహకు రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామ రైతులు శనివారం జోగిపేటలో మంత్రి పర్యటన సందర్భంగా ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో అధికంగా మొక్కజొన్న పంటను సాగుచేశామని ప్రైవేట్‌లో తక్కువ ధరకు విక్రయించడం ద్వారా తాము నష్టపోతామని కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా మద్దతు ధరను కల్పించాలని మంత్రిని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్ర ఏర్పాటుపై మంత్రి సానుకూలంగా స్పందించారు.


